షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలోని కీలకమైన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడేలా భారీ సైబర్ ఎటాక్ జరిగింది. అమెరికాలోని పలు ఆసుపత్రులపై జరిగిన సైబర్ అటాక్ కారణంగా.. వైద్య సేవలు నిలిచిపోయిన అరుదైన పరిణామం చోటు చేసుకుంది. న్యూజెర్సీ.. న్యూమెక్సికో.. ఓక్లహామా రాష్ట్రాల్లోని 20కు పైగా ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
మూడు రాష్ట్రాల్లో ఇరవైకు పైగా ఆసుపత్రుల్ని నిర్వహిస్తున్న అర్డెంట్ హెల్త్ సర్వీసెస్ అనే సంస్థ వైద్య సేవలతో పాటు.. ఇతర సదుపాయాల్ని కల్పిస్తుంది. సైబర్ నేరగాళ్లు సదరు ఆసుపత్రుల్లోని సాఫ్ట్ వేర్ సిస్టంను హ్యాక్ చేశారు. దీంతో.. వైద్య సేవలకు సంబంధించి తీవ్రమైన అంతరాయం ఏర్పడిన పరిస్థితి. దీంతో ఆ సంస్థకు చెందిన ఆసుపత్రుల్లో క్లినికల్.. ఫైనాన్షియల్ ఆపరేషన్స్ నిలిచిపోయినట్లుగా చెబుతున్నారు.
దీంతో హైఅలెర్టు ప్రకటించిన సదరు సంస్థ.. తమ సాఫ్ట్ వేర్ సేవల్ని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొంది. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్ని తీసుకుంటున్నారు. మాన్యువల్ గా వైద్యం అందించేందుకు వీలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఐసీయూలో ఉన్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. సాధారణ వైద్య సేవల్ని అందిస్తున్న సదరు ఆసుపత్రుల చైన్.. సర్జరీలను మాత్రం వాయిదా వేసింది.
తమపై జరిగిన సైబర్ దాడికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఆ సంస్థ వెల్లడించలేదు.అయితే.. తామీ దాడిని సమర్థంగా ఎదుర్కొంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం వైద్య వర్గాల్లో కలకలాన్ని రేపింది.