11 ఛార్జ్ షీట్లలో ఏ1 గా ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని, త్వరితగతిన విచారణ చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృషరాజు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, బెయిల్ రద్దు అంశంపై సీబీఐ అధికారులు, జగన్ కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. అయితే, వారు కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు…కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామని వెల్లడించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తున్నామని తెలపిింది. దీంతో, జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడినట్లయింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరడంతో…విచారణ వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో జగన్, సీబీఐ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గత వాయిదాలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసే సమయానికి ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో జగన్ బిజీగా ఉన్నారని నెటిజన్లు పంచ్ లు వేస్తున్నారు. మోడీని జార్ఖండ్ సీఎం సోరెన్ విమర్శించగా…దానితో ఏ మాత్రం సంబంధం లేని జగన్…కేవలం మోడీ మెప్పు పొందేందుకే ఆ ట్వీట్ పై మోడీకి అనుకూలంగా స్పందించి జాతీయస్థాయిలో విమర్శల పాలయ్యారు.
బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా కోసమే మోడీని జగన్ పొగిడారని అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. వాస్తవానికి కౌంటర్ దాఖలు చేయడం సీబీఐకి ఒక రోజులో పూర్తయ్యే వ్యవహారం. కానీ, జగన్ తో పాటు ఒకేసారి కౌంటర్ దాఖలు చేయాలన్నట్టుగా జాప్యం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కానీ, జగన్ తో సంబంధం లేకుండా సీబీఐ కౌంటర్ దాఖలు ఎందుకు చేయడం లేదో వారికే తెలియాలి.
గంటల్లో తేలిపోయే పనికి వారాలకు వారాల గడువును సీబీఐ ఎందుకు కోరుతోందో న్యాయనిపుణులకూ అంతు చిక్కడం లేదు. మరో వైపు పిటిషనర్ అయిన రఘురామకృష్ణరాజును అక్రమ కేసులో ఇరికించారని, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని.. ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రావడంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.