తెలంగాణలో ఒకే సమయంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు ఇటు రాజకీయంగా అటు సినీ వర్గాల పరంగా కూడా.. కలకలం రేపుతున్నాయి. ఒకటి నటుడు మోహన్‌బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన వ్యవహారం. రెండు.. తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం. ఈ రెండు వ్యవహారాలు కూడా.. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యాయి. మోహన్‌బాబు తన కుమారుడు మనోజ్ ఆస్తుల వివాదంలో ఓ మీడియా ప్రతినిధిపై చేయి చేసుకున్నారు.
ఈ ఘటనలో రిపోర్టర్ గాయపడ్డాడు. ఇంతలోనే తనపై కూడా దాడి జరిగిందంటూ మోహన్‌బాబు.. ఆసుప త్రిలో చేరారు. మరోవైపు మోహన్‌బాబుపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ క్ర మంలో ఆయన బెయిల్ కోరుతూ హైకోర్టునుఆ శ్రయించారు. అయితే.. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్బాబుకూడా అరెస్టు అవుతారన్న ప్రచారం జరుగుతోంది.ఇక, సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రెండు ఘటనలు కూడా.. తీవ్ర చర్చకు దారి తీశాయి.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఈ రెండు అంశాలపైనా స్పందించారు. తాను మోహన్‌బాబును, అల్లు అర్జున్ను కాపాడలేనని ఆయన వ్యాఖ్యానించారు.ఈ రెండు విషయాల్లోనూ తన జోక్యం ఏమీ ఉండదని.. చెప్పిన ఆయన చట్టం ప్రకారం పోలీసులు వ్యవహరిస్తారని తెలిపారు. బెయిల్ కోసం మోహన్‌బాబు కోర్టును ఆశ్రయించిన విషయం తన దృస్టికి వచ్చిందన్నారు. ఇక, అర్జున్ విషయంలో కూడా చట్ట ప్రకారమే పోలీసులు నడుచుకుంటారని.. ఎవరైనా చట్టం ముందు సమానమేనని అన్నారు. ఈ విషయంలో తను కానీ.. తనమంత్రులు కానీ జోక్యం చేసుకునేది ఉండదని చెప్పారు.
మరోవైపు మంత్రివర్గ విస్తరణపైనా స్పందించిన రేవంత్ రెడ్డి.. ఇప్పట్లో లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరుగుతున్నాయని.. అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని ఆపుకొని మంత్రి వర్గ విస్తరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఏమైనా ఉంటే.. వచ్చే ఏడాది చూసుకుందామని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమకు అనేక లక్ష్యాలు ఉన్నాయని.. వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.