ఏపీ సీఎం జగన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఆయన గుంటూరులో పర్యటిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడలనుప్రోత్సహించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గుంటూరుకు వస్తున్న సీఎం జగన్కు యువత, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చుట్టుగుంట సెంటర్లో యువత, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
“ఆడుదాం ఆంధ్ర సరే.. ఆట స్థలాలు ఎక్కడా?“ అంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిలదీశాయి. మరోవైపు.. నిరుద్యోగులు కూడా తమకు ఉపాధి ఎక్కడ అంటూ.. నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్టేడియం లను నాశనం చేసి, కబ్జా చేసి.. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆటలా అంటూ యువకులు మండిపడుతున్నారు. చుట్టుగుంట సెంటర్లో సీఎం జగన్ పర్యాటనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
మరోవైపు.. పోలీసులు వారిని అడ్డుకున్నా.. `సీఎం జగన్ రెడ్డి గో బ్యాక్` అంటూ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇక, చేసేది లేక పోలీసులు యువతను,నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వివాదాస్పద ఫ్లెక్సీల కలకలం రేగింది. నల్లపాడులో వైసీపీ నేతల భూ దోపిడిపై ఫ్లెక్సి ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.
స్థానిక నల్లపాడులోని సర్వే నెంబర్ 543, 546, 550 లలో వాగు పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారంటూ.. ఈ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. తమ గ్రామం పోరంబోకు భూమిని కాపాడు జగనన్న అంటూ స్థానిక ప్రజానీకం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే.. కొద్ది సేపటికే పోలీసులు ఈ ఫ్లెక్సీని తొలగించేశారు.