నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు, బెయిల్, ఆసుపత్రికి తరలింపులో హైకోర్టు ఆదేశాల ధిక్కరణ వంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్నారు. రఘురామను జైలు నుంచి రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీఐడీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, రమేశ్ ఆసుపత్రిలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించే అంశంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశముంది.
సీబీఐ కోర్టు, హైకోర్టుకన్నా తమకు ఎక్కువ అధికారాలున్నాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారేమోనని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రఘురామను కనీసం ఓ రోజైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే రాత్రంతా జైల్లోనే ఉంచారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదేమంటే, రఘురామను రమేశ్ ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారని విమర్శిస్తున్నారు.
ఓ ఎంపీగా…భారత దేశ పౌరుఢిగా… రఘురామకృష్ణరాజుకు ఉన్న రాజ్యాంగ హక్కులన్నింటినీ ఏపీ ప్రభుత్వం, సీఐడీ అధికారులు హరిస్తున్నారని అంటున్నారు. ఈ కేసులో ఫిర్యాదిదారుడుగా ఉన్న సీఐడీ అదనపు డీజీ ఆసుపత్రిలో రఘురామను కలవడం చర్చనీయాంశమైంది. ఒకవేళ నిజంగానే రఘురామను పోలీసులు కొట్టకపోతే…రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడంలో అభ్యంతరం ఎందుకుని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తమ గుట్టు రట్టవుతుందనే రమేశ్ ఆసుపత్రికి రఘురామను తరలించడం లేదని రఘురామ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐడీ అధికారులు కొట్టడం వల్లే రఘరామ కాళ్లు వాచాయని, ఆయనకు అసలు సొరియాసిస్ లేదని అంటున్నారు. అయినా, కోర్టులపై, జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారి ఆదేశాలను పాటించకపోవడం..చివరకు మొట్టికాయలు వేయించుకోవడం జగన్ సర్కార్కు కొత్తేమీ కాదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.