డిప్యూటీ సీఎం నారాయణకు కోపం వచ్చింది. తెలుసు కదా ! కోపం వచ్చినా, సహనం కోల్పోయినా, ఆవేశం వచ్చినా ఆయన శరీరం కంపిస్తుంది. అదేవిధంగా నోటికి వచ్చిన భాష కూడా బయటకు వస్తుంది. వినేందుకు, రాసేందుకు వీల్లేని భాషలో ఆయన ఎన్నో సార్లు ఎన్నో మాటలు అన్నారు. అవి అసెంబ్లీ వేదికలలో కూడా వినిపించాయి. ఈ సారి ఆయన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తన సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు (చిత్తూరు జిల్లా) లో పర్యటించారు.
ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాల అమలు తీరు గురించి వివరించే ప్రయత్నం చేశారు.ఇదే సందర్భంలో ఆయనకు కోపం తెచ్చిన సంఘటన ఒకటి కనిపించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి సుబ్బమ్మ అనే మహిళతో ఆయన నిన్నటివేళ మాట్లాడారు. పథకాలు అందుతున్నాయా లేదా అని పేరుపేరునా వాటి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేశారు.
ఇదే సమయంలో ఈ పథకాలు అన్నీ ఎవరు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఈ పథకాలు అన్నీ ఎవరు ఇస్తున్నారు అని మళ్లీ మళ్లీ అడిగారు.. కొందరు బ్యాంకర్లు అని చెప్పారు. అటుపై చుట్టు పక్కల ఉన్నవారు ఈపథకాలను వర్తింపజేస్తున్నది అందిస్తున్నది బ్యాంకర్లు కాదు జగనన్న ఇస్తున్నారని చెప్పారు. అప్పటికే డిప్యూటీ సీఎం కోపం నషాళానికి చేరింది.
మళ్లీ జగన్ పార్టీ గుర్తు ఏంటని అడిగారు. సైకిల్ గుర్తు అని సుబ్బమ్మ చెప్పేటప్పటికీ ఆయన ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోయారు. వలంటీర్లపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. పథకాల విషయమై ఆమెకు అవగాహన కల్పించడంలో విఫలం అయిన వలంటీరు ను వెంటనే తొలగించాలని ఆదేశించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తరువాత అక్కడి కార్యకర్తల తీరుపై కూడా ఆయన కోపం అయ్యారు. పథకాల అమలుపై ఇంటింటికీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది వలంటీర్లదే కదా ! అంటూ ఆయన తనదైన శైలిలో తన సొంత మనుషులపై కోపం వెళ్లగక్కారు అని సమాచారం.
Comments 1