సాధారణంగా ఏ తండ్రి అయినా తన కొడుక్కి కూడా వారసుడు ఉండాలని, తన వంశం ముందుకు సాగాలని కోరుకుంటాడు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం అతీతం కాదని తాజాగా రుజువైంది. చిరంజీవికి ముగ్గురు సంతానం. కూతుర్లు సుస్మిత, శ్రీజ.. కుమారుడు రామ్ చరణ్. సుస్మితకు ఇద్దరు కూతుర్లు కాగా.. శ్రీజ తన మొదటి భర్త ద్వారా ఒక కూతురికి, రెండో భర్త ద్వారా ఒక కూతురికి జన్మనిచ్చింది. మరోవైపు రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు వివాహమైన పదేళ్లకి తమ ఫస్ట్ చైల్డ్ ను ఆహ్వానించారు. అయితే వీరికి కూడా ఆడపిల్ల పుట్టడంతో చిరంజీవి ఇల్లు లేడీస్ హాస్టల్ గా మారింది. ఇదే విషయాన్ని తాజాగా `బ్రహ్మా ఆనందం` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ప్రస్తావించారు.
ఈవెంట్ లో యాంకర్ సుమ.. మనవరాళ్లతో ఆడుకుంటున్న చిరంజీవి ఫోటోను స్క్రీన్ పై చూపించింది. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. నా ఇళ్లంతా మనవరాళ్లతో నిండిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా నా పరిస్థితి ఉంటుందంటూ సరదా కామెంట్స్ చేశారు. అందుకే ఈసారి కొడుకుని కనరా అని రామ్ చరణ్ ను అడిగానని.. చరణ్ కొడుకుతో తమ లెగసి కంటిన్యూ చేయాలనే కోరిక తనకు ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అలాగే క్లింకారా అంటే తనకెంతో ఇష్టమని.. కానీ మళ్లీ ఇంకొక అమ్మాయిని కంటాడేమోనని తనకు భయంగా ఉందని చిరు అనడంలో అక్కడున్న వారంతా నవ్వేశారు. ప్రస్తుతం చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. మెగా అభిమానులు మరియు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మెగా లెగసీని కంటిన్యూ చేయడానికి చరణ్ కు కొడుకు పుట్టాలని కొందరు అంటుంటే.. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ అందుకు పనికిరాడా అంటూ భిన్నంగా మరికొందరు స్పందిస్తున్నారు. ఏదేమైనా తండ్రి కోరికను చరణ్ తీరుస్తాడా? లేదా? అన్నది చూడాలి.