ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. నిన్న ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరిస్తూ సంచలన ఆదేశాలిచ్చింది. సీఐడీ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. రాజమండ్రి జైలులో చంద్రబాబు వంటి వీవీఐపీకి భద్రత లేదని, ఆయనకు ప్రాణహాని ఉండొచ్చని లూథ్రా చేసిన వాదనలతో జడ్జి ఏకీభవించలేదు.
మరోవైపు, రాజమండ్రి జైలులో చంద్రబాబుకు భద్రతకు ఎటువంటి ఢోకా లేదని, అవసరమైతే మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు…చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను రిజెక్ట్ చేసింది. ఇక, చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజాగా, చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్ల విచారణపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఆ పిటిషన్లలో లంచ్ మోషన్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుండగా, మిగతా రెండు పిటిషన్లపై జరిగే అవకాశముంది. లంచ్ మోషన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపింది.