ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 164 సీట్లను గెలుచుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యంగా టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలకు గాను 135 స్థానాలను గెలుచుకొని అత్యధిక స్ట్రైక్ రేట్ తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక, జనసేన పోటీ చేసిన 21 స్థానాలను కైవసం చేసుకొని 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు పోయింది. బిజెపి పోటీ చేసిన 10 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయం సాధించి 2 స్థానాల్లో ఓడిపోయింది. ఇక, అధికార పార్టీ వైసీపీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని కేవలం 11 స్థానాలకే పరిమితమై ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘోర పరాభవంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారి స్పందించారు.
ఈ ఎన్నికలు టీడీపీ చరిత్రలో, ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని, ఇవి హిస్టారికల్ ఎన్నికలని చంద్రబాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో 1983లో టీడీపీ 200 సీట్లతో తిరుగులేని విజయం సాధించిందని, అవన్నీ మరిపించేలా అనూహ్యంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయో అందరికీ తెలుసన్నారు. ఆ బాధ అనుభవించిన ప్రజలకు తెలుసని, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కునే కోల్పోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులను కలిగివుండే స్వేచ్ఛ కోల్పోయే పరిస్థితులు రావడంతో ఈ తీర్పునిచ్చారన్నారు. ప్రజలు, రాష్ట్రం కోసమే కూటమిగా జతకట్టి పోరాడమని అన్నారు. కూటమికి 55.38 శాతం ఓట్లు రాగా..టీడీపీకి 45.06 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. వైసీపీకి 39.37 శాతం ఓట్లు పడ్డాయని తెలిపారు. 95 వేల మెజారిటీ (గాజువాక), 94 వేల మెజారిటీ (భీమిలి), మంగళగిరిలో 91 వేల మెజారిటీ ట్రెండ్ ను ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావడంలేదన్నారు.
అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏమైనా చేస్తా అనే ధోరణిని ప్రజలు క్షమించరని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఈ ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు నానా ఇబ్బందులు పడ్డారని, నిద్రలేని రాత్రులు గడిపారని గుర్తు చేసుకున్నారు. మీడియా కూడా ఐదేళ్లుగా పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావని, మీడియా ప్రతినిధులను సీబీసీఐడీ ఆఫీసులో పెట్టి వేధించిన విధానం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు.