టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు మారుతున్నాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన గట్టి వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు మరింత వూపుతో ముందుకు సాగుతున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇక, రా.. కదలిరా! సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. జనసేనతో కలిసి ఉమ్మడి సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇవి ఇలా ఉంటే.. మరోవైపు నారా భువనేశ్వరి కూడా ప్రజల్లోనే ఉన్నారు. నిజం గెలవాలి.. పేరుతో నిర్వహి స్తున్న యాత్రలను ఆమె వచ్చే రెండు మాసాల వరకు కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలకు ప్రణాళికలను రెడీ చేశారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారిని ప్రస్తుతం పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తున్న భువనేశ్వరి రాబోయే రోజుల్లో ఆయా కుటుంబాలతో సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక, నారా లోకేష్.. ఈ నెల 18 నుంచి మరోసారి ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరిం చుకుని ఆరోజు ప్రణాళికను వెలువరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఐటీ రంగం లోని టీడీపీ సానుభూతిపరులను పార్టీవైపు మరింత దూకుడుగా తీసుకువచ్చేందుకు నారా వారి కోడలు బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగనున్నారు. ఇక, హిందూపురంలో బాలయ్యను గెలిపించుకునేందుకు ఆయన సతీమణి వసుంధర ఇప్పటికే రంగంలోకి దిగారు.
వారానికి రెండు రోజులు ఇక్కడే మకాం వేసి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యుల సాయాన్ని కూడా.. చంద్రబాబు తీసుకోనున్నారు. మొత్తంగా చూస్తే.. నాడు-నేడు చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని.. అసెంబ్లీలో తాను చేసిన శపథాన్ని నిజం చేసుకోవాలనిఆయన తపిస్తున్నారు. దీంతో వ్యూహాలకు మరింత పదును పెడుతుండడం గమనార్హం.