ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తల కవ్వింపు చర్యల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య కొన్ని చోట్ల గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులు, ప్రతిదాడులపై చంద్రబాబు స్పందించారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు, ఘర్షణల గురించి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. గొడవలపై పార్టీ క్యాడర్ సహనంతో వ్యవహరించాలని సూచించారు.
వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు కూడా శాంతి భద్రతలు అదుపులో ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.