టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు .. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైతే.. తామేం చేస్తామన్న దానికి సంబంధించి వరాల వర్షాన్ని కురిపించారు. పలు పథకాలకు సంబంధించిన వివరాల్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వరాల్లో కొన్నింటిని యథాతధంగా తీసుకోవటం కనిపించింది.
చంద్రబాబు ప్రకటించిన హామీల్నిచూస్తే..
– ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణం
– 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకూ ‘మహాశక్తి’ కార్యక్రమం కింద నెలకు రూ.1500
– చదువుకునే పిల్లలందరికి తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ.15వేలు
– ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
– వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు
– నెలకురూ.3వేలు నిరుద్యోగ భ్రతి
– యువతను బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. నాలెడ్జ్ ఎకానమీలో వారు ఎదిగేలా చేస్తాం.
– ప్రతి రైతుకు ఏటా రూ.20వేల చొప్పున సాయం
– బీసీల రక్షణకు ప్రత్యేకంగా చట్టం
– ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం
– పేదలను ఆదుకుంటాం. ఎస్సీ.. ఎస్టీల డెవలప్ మెంట్ కోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వస్తాం.
ఈ వరాల్నిచూస్తే.. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలకు కాసింత నిధుల్ని అదనంగా ఇవ్వటం కనిపిస్తుంది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని అంశాల్ని చంద్రబాబు ప్రకటించిన వరాల జీబితాలో ఉండటం గమనార్హం. మరి.. చంద్రబాబు హామీలపై ఏపీ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది తేలాలంటే మరో నాలుగు నెలలు ఆగితే సరిపోతుంది.