ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది రాజకీయాల్లో కామనే. ఇప్పుడు ఇదే వ్యవహారం.. కూటమిపార్టీల మధ్య కూడా కనిపిస్తోంది. సహజంగా ప్రత్యర్థుల వీక్నెస్ను గుర్తించి ఆదిశగా అడుగులు వేయడం.. రాజకీయాల్లో కామన్. కానీ, ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు.. సొంత మిత్ర పక్షాలను కూడా ఇలానే సరిపుచ్చుతుండడం గమనార్హం. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీకావని.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
సీఎం చంద్రబాబుకు ఉన్న వీక్ నెస్, స్ట్రాంగ్‌నెస్ ఒక్కటే. ఆయనను పొగడాలి. ఆయన పాలనను మెచ్చు కోవాలి. ఆయన విజన్‌ను ఆకాశానికి ఎత్తేయాలి. ఆ తర్వాత.. ఎన్ని కొర్రీలు పెట్టినా.. ఆయన కిమ్మనరు. ఆకాశాన్ని నేలకు దించేయమన్నా .. ఓకే అనేసేంత బోళా శంకురుడు టైపు. ఈ విషయాన్ని కేంద్రం బా గానే గుర్తించినట్టుంది. దీంతో చంద్రబాబు కూర్చున్నా.. నిలబడ్డా.. పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఫలితంగా మొహమాటానికి పోతున్న చంద్రబాబు.. రాజీ పడిపోతున్నారు.
తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రుల వరకు కూడా.. అనేక మందిని చంద్రబా బు కలుసుకున్నారు. అయ్యా.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వండి.. మేం బాగుపడతాం. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధిలేదు. దానిని చేసుకుంటాం.. అని సెలవిచ్చారు. నిజానికి కూటమి పార్టీలో కీలక రోల్ పోషిస్తున్నా.. చంద్రబాబు మాత్రం `డౌన్ టు ఎర్త్` అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రం ఆయన వీక్నెస్ను తనకు అనుకూలంగా మలుచుకుంది.
ఇక, చెప్పొచ్చేదంటంటే.. ఎన్నో ఆశలతో హస్తిన యాత్ర చేసిన చంద్రబాబుకు నిజానికి చెప్పాలంటే.. స్వల్ప హామీలే తప్ప పెద్దగా ఒరిగింది ఏమీలేదు. కానీ, గంపెడలు పొగడ్తలు.. రెండు గంపల ప్రశంసలు మాత్రం దక్కాయి. వంద రోజుల చంద్రబాబు పాలనను ప్రధాన మంత్రి నుంచి కేంద్ర మంత్రుల వరకు ప్రస్తుతించారు. అంతేకాదు.. వరదల్లో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగిన విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇంకేముంది.. చంద్రబాబు ఆ ప్రసంశల జడిలో తడిచి ముద్దయి.. ఏపీకి తిరిగివచ్చారు. ఇదీ.. జరిగింది!!