ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రస్తుతం ఏపీని హీటెక్కిస్తోంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజాయన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని వ్యూయాలు రచిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఆయన ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.
అలాగే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నేడు నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఇకపోతే విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బరిలోకి దూకే కూటమి అభ్యర్థి ఎవరు అన్నదానిపై గత కొద్ది రోజుల నుంచి సస్పెన్స్ నడుస్తోంది. టీడీపీ నుంచి పీలా గోవింద్, గండి బాబ్జీతో పాటు పలువురు నేతలు పోటీలో ఉన్నారు. అయితే వారిని కాదని కూటమి తరఫున అభ్యర్ధిగా బైరా దిలీప్ చక్రవర్తిని చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో అనకాపల్లి ఎంపీ సీటును బైరా దిలీప్ ఆశించారు. కానీ అఖరి నిమిషంలో ఆ సీటును బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఎంపీ సీటు మిస్ అయిన బైరా దిలీప్ ను ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా దింపబోతున్నారు. నేడు అభ్యర్థి పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.