గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న 41 వేల కోట్ల రూపాయల రాజకీయానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల పీఏసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్.. ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ.. ప్రబుత్వంపై ఆరోపణలు చేయడంతోపాటు.. ఏకంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ సంధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చకు దారితీసింది. దీనిపై తాజాగా స్పందించిన బుగ్గన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని ఎదురుదాడి చేశారు.
పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా చేసుకొని విమర్శ లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని పయ్యావుల ఆరోపణలపై బుగ్గన బదులిచ్చారు. పీఏసీ ఛైర్మన్‌కు అనుమానాలు ఉంటే ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవచ్చన్నారు. సందేహా లు ఉంటే సమావేశం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. లేఖలు రాయడం వల్ల ప్రయోజనమేంటో అర్థం కావడం లేదని ఆక్షేపించారు.
రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగితే వ్యవస్థలు చూసుకోవా? ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ చూపి ఆరోపణలు చేయడం శోచనీయం అని బుగ్గన విమర్శలు చేశారు. “ఆర్థిక అంశాలపై యనమల మాట్లాడతారు.. ఈసారి పయ్యావుల ఆరోపణలు చేశారు. గవర్నర్‌కు లేఖ, మీడియా సమావేశాలు ఇలా ఇన్ని విమర్శలేంటో అర్థం కావడం లేదు. రూ.41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరింది. ఈ వ్యవహారానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ కారణం.. చెల్లింపులన్నీ కేంద్రీకృతం కావడమే. 2018లో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమే. ఈ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టారు’’ అనిబుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మొత్తానికి 41 వేల కోట్ల అవకతవకలు.. ప్రభుత్వాన్ని బాగానే కుదిపేస్తున్నట్టున్నాయని అంటున్నారు పరిశీలకులు.