పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి .. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ సవాలు విసిరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నార్కో అనాలసిస్ పరీక్షకు అవినాష్ రెడ్డి రెడీనా అని ప్రశ్నించారు. తాను ఆ టెస్టుకు రెడీ అని రవి స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు గురించి అధికార పార్టీకి చెందిన మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని బీటెక్ రవి ఆరోపించారు. అందులో వచ్చిన కథనంపై బీటెక్ రవి స్పందించారు. వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని అన్నారు. అవసరమైతే నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
వివేక కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు. ఆయనకు చేయబోయే టెస్టును లైవ్‌లో రాష్ట్రం మొత్తం చూసేలా ప్లాన్ చేయాలని సూచించారు. దమ్ముంటే అవినాష్ తన సవాలుకు ఒప్పుకోవాలని బీటెక్ రవి సవాలు విసిరారు. కేసు సీరియస్‌గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి పోతాడని ఎద్దేవా చేశారు. వివేక హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపిన విషయం ఎలా తెలిసిందో జగన్ సమాధానం చెప్పాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. అంతేకాదు.. సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి, క్షణాల్లో బయటక వదిలిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
అప్రూవర్‌గా మారిన దస్తగిరిని వేధించి కేసులు పెడుతున్నారని.. ఆయన ప్రాణాలకు హాని ఉందని చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. సీబీఐ ఎస్పీ రాం సింగ్‌పైనే కేసులు పెట్టించారని రవి విమర్శించారు. సొంత చెల్లి అని కూడా చూడకుండా.. డాక్టర్ సునీత వస్తే.. ఆమెను తీవ్రంగా అవమానించారని అన్నారు. అవినాష్ రెడ్డి ప్రమేయం లేనప్పుడు.. ఆయన తండ్రి భాస్కరరెడ్డి జైల్లో ఎందుకు ఉ న్నాడో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎందుకు వాయిదాలు కోరుతున్నారని ప్రశ్నించారు.
తప్పు చేయనప్పుడు.. వివేకా కేసులో తన పాత్ర లేనప్పుడు.. కోర్టులో తన సత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా? అని నిలదీశారు. ఇవన్నీ వదిలేసి.. కేసును వాయిదా వేయించుకోవడం.. బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఎవరు తప్పులు చేశారో అందరికీ తెలుసునని.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మరి బీటెక్ రవి సవాల్ పై అవినాష్ రెడ్డి స్పందిస్తారో లేదో చూడాలి.