తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు ఉదయం మల్లారెడ్డి తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం గుండా ఆయన తిరుమల చేరుకున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా మల్లారెడ్డి వెంట ఉన్నారు. దర్శనం అనంతరం మీడియాతో ఆయన ముచ్చటించారు.
ఏపీని భారీ వర్షాలు, వరదలు అంతలాకుతలం చేస్తున్న అంశంపై మల్లారెడ్డి స్పందించారు. విజయవాడను వరదలు ముంచెత్తాయని.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసించారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుకు మాత్రమే సొంతమన్నారు.
తన అనుభవంతో విపత్తు నుంచి చంద్రబాబు ప్రజలను రక్షించారని ఏపీ సీఎంను మల్లారెడ్డి కొనియాడారు. ఈ క్రమంలోనే పార్టీ వీడటం గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని గత కొద్ది రోజుల నుంచి మల్లారెడ్డిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తాజాగా మరోసారి మల్లారెడ్డి ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. ఒకవేళ వెళ్తే తానే స్వయంగా ఆ విషయాన్ని తెలియజేస్తానని మల్లారెడ్డి పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు.