రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎంఎల్ఏల్లో ఒకళ్ళపై బాగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండురోజుల క్రితం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నలుగురు ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు కలిసారు. రేవంత్ ను బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కలవగానే వెంటనే సోషల్ మీడియా, టీవీల్లో సంచలనమైపోయింది. నలుగురు ఎంఎల్ఏలు తొందరలోనే పార్టీ మారబోతున్నారంటు పార్టీలో కూడా గోలమొదలైపోయింది. నలుగురు ఎంఎల్ఏల వైఖరి పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. అయితే బుధవారం ఇదే విషయమై సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతు తాము పార్టీ మారటంలేదన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పారు. రేవంత్ ను కలిసిన నలుగురు ఎంఎల్ఏలు కేసీయార్ సొంత జిల్లా మెదక్ జిల్లా వాళ్ళే కావటం సంచలనమైంది. అందులోను సోమవారమే మంత్రి పొన్నం ప్రభాకర్ రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ తో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. దాంతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం పెరిగిపోయింది. పార్టీ మారే విషయమై సునీత వివరణిచ్చిన కాసేపటికే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయనేమన్నారంటే కాంగ్రెస్ ది నిజమైన ప్రజాప్రభుత్వమన్నారు.
తాము ముఖ్యమంత్రిని కలవటానికి అపాయిట్మెంట్ అడిగిన వెంటనే అదేరోజు దొరకటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక్కరోజులోనే బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు అపాయిట్మెంట్ దొరకటం, సీఎం కలవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమికావాలన్నారు. కేసీయార్ హయాంలో మంత్రులు కలిసేందుకు దిక్కులేదని చెప్పారు. మంత్రులకే కేసీయార్ అపాయిట్మెంట్ లేనపుడు ఇక ప్రగతిభవన్లోకి ఎంఎల్ఏలకు ఎంట్రీయే ఉండేది కాదని గుర్తుచేసుకున్నారు.
సొంత ఎంఎల్ఏలతో పాటు ప్రతిపక్షాల ఎంఎల్ఏలు, నేతలతో పాటు మామూలు జనాలను రేవంత్ ప్రతిరోజు కలవటం చాలా హ్యాపీగా ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోందని జనాలు అనుకోవటంలో తప్పేమీలేదన్నారు. మహిపాల్ మాటలు విన్నతర్వాత ఈ ఎంఎల్ఏ తొందరలోనే కాంగ్రెస్ లోకి జంప్ అయిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.