బీఆర్ఎస్ యువ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(37) ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురై హఠాన్మరణం పాలయ్యారు. ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు రెయిలింగ్ ను ఢీట్టడంతో ఘటనా స్థలంలోనే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితం లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఘటన జరిగి కొద్ది నెలలు కూడా గడవక ముందే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు.
లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతి చిన్న వయసులోనే శాసనసభ్యురాలిగా ఎన్నికైన లాస్య నందిత అకాల మరణం తనను కలచివేసిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇక, వారం రోజుల క్రితమే లాస్యను తాను పరామర్శించానని, ఇంతలోనే ఆమె లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని కేటీఆర్ అన్నారు. ఈ కష్టకాలాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కేటీఆర్ ప్రార్థించారు. లాస్య నందిత మృతి పట్ల పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని తెలుస్తోంది.