ఒక సినిమా విజయవంతం కావాలంటే నటీనటులు ఎవరు..? ఏ డైరెక్టర్ తీశాడు..? సినిమా బడ్జెట్ ఎంత..? వంటి విషయాల కన్నా కథలో దమ్ము ఉందా లేదా అన్న అంశాన్నే ప్రేక్షకుడు ప్రధానంగా పరిశీలిస్తాడు. కంటెంట్ బాగోక పోతే ఎంత పెద్ద హీరో నటించిన.. భారీ బడ్జెట్ తో నిర్మించినా ఆడియన్స్ ఆ సినిమాను యాక్సెప్ట్ చేయరు. ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా కు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.
దాదాపు రూ. 45 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే.. విడుదల తర్వాత ఫుల్ రన్ లో కేవలం రూ. 70 వేలు వసూలు చేసి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ గా చెత్త రికార్డును నమోదు చేసింది. ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు కదా.. `ది లేడీ కిల్లర్`. అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ హీరోగా యాక్ట్ చేశాడు. భూమి పెడ్నేకర్ అతనికి జోడిగా చేసింది.
2023న నవంబర్ 3న దేశవ్యాప్తంగా కేవలం 12 షోలతో విడుదలైన ది లేడీ కిల్లర్ తొలి ఆట నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాల్సి ఉన్నా.. ఖర్చు ఎక్కువ కావడం వల్ల అనేక ఎడిటింగ్ కట్లు మరియు వాయిస్ఓవర్లతో అసంపూర్ణంగా సినిమాను రిలీజ్ చేశారు. దాంతో టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉన్నా సినిమా మాత్రం దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది.
తొలి రోజు 293 టిక్కెట్లు మాత్రమే సేల్ అయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రూ. 45 కోట్ల బడ్జెట్ తో ది లేడీ కిల్లర్ ను నిర్మిస్తే.. ఈ చిత్రం 70 వేల రూపాయిలు మాత్రమే రాబట్టగలిగింది. భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఈ ఖరీదైన ఫ్లాప్ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.