కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై తొలిసారిగా బీజేపీ ఎంపి వరుణ్ గాంధీ గొంతు వినిపించారు. గడచిన తొమ్మిది నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమం చేస్తున్న రైతాంగానికి మద్దతుగా వరుణ్ గాంధి మాట్లాడటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి షాకిచ్చేదే అనడంలో సందేహం లేదు. ఉద్యమం చేస్తున్న రైతుల విషయంలో కేంద్రం వైఖరిని ఎంపి తప్పుపట్టారు. వెంటనే రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను కేంద్రం సానుభూతితో పరిశీలించాలని ఎంపి విజ్ఞప్తి చేయటం పార్టీలో కలకలం రేపింది.
కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు గడచిన తొమ్మిది నెలలుగా ఢిల్లీ శివార్లలోని ముజఫర్ నగర్ లో ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాల రద్దుకు రైతు సంఘాలు ఎంత డిమాండ్ చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో మొదట్లో మధ్యవర్తిత్వం చేద్దామని సుప్రీంకోర్టు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్ధంకావట్లేదు.
వ్యవసాయ చట్టాలను ఎలాగైనా అమల్లోకి తేవాల్సిందే అని మోడి మహా పట్టుదలగా ఉన్నారు. దాంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కేంద్ర మంత్రులు సైతం వెనకాడుతున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు లోలోపల ఎలాగున్నా మోడీ అంటే భయం వల్ల బయటకు ఏమీ మాట్లాడటం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపి వరుణ్ గాంధీ మాత్రం రైతు సంఘాల ఉద్యమానికి బహిరంగంగా మద్దతు పలకడం ఆశ్చర్యంగా ఉంది. కిసాన్ పంచాయత్ లను ఎంపి సమర్ధించటం పార్టీలో సంచలనంగా మారింది.
అయితే ఎంపి బహిరంగంగా రైతు సంఘాలకు మద్దతు ప్రకటించటం, కిసాన్ పంచాయత్ లకు అనుకూలంగా మాట్లాడటం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. అదేమిటంటే వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. పై రాష్ట్రాల్లో మణిపూర్, గోవాలను వదిలేస్తే మిగిలిన మూడు రాష్ట్రాల్లో రైతులు పార్టీల గెలుపోటములను శాసించే స్ధాయిలో ఉన్నారు.
పై మూడింటిలో కూడా పంజాబ్, యూపీలో అయితే రైతాంగం గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. పంజాబ్ లో ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు నామినేషన్లు వేయటానికి కూడా భయపడ్డారు. యూపీలో అంత పరిస్ధితి లేదుకానీ రైతులు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీపై ఎలాంటి దెబ్బ పడుతుందో అని కమలనాదులకు టెన్షన్ ఉన్నా మోడీకి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో వరుణ్ గాంధీ చేసిన ప్రకటనపై మోడి ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.