అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయాలతో నాన్ అమెరికన్లు..ముఖ్యంగా ఎన్నారైలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేయడంతో..కొందరు కోర్టుకెక్కారు. అయినా సరే సుప్రీం కోర్టులో తేల్చుకుంటానని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ చట్టంపై ట్రంప్ సంచలన కామెంట్లు చేశారు.
జన్మత: అమెరికన్ పౌరసత్వం చట్టం గతంలో బానిసల పిల్లల కోసం తెచ్చిందని, బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలడమే ఆ చట్టం ప్రాథమిక లక్ష్యమని అన్నారు. కానీ, ప్రపంచం అంతా అమెరికా మీద పడిపోవడానికి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏటా లక్షలాదిమంది అమెరికాకు వస్తున్నారని, అర్హత లేని వాళ్లు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు.
అర్హత లేని వ్యక్తుల పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తోందని, గొప్ప ఉద్దేశంతో తెచ్చిన జన్మతః పౌరసత్వం చట్టం దుర్వినియోగం అవుతోందని అన్నారు. అందుకే, ఆ చట్టం నిలిపివేతపై తాను సుప్రీంకోర్టుకు వెళతానని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న విశ్వాసంతో ఉన్నానని తెలిపారు.