రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2 రోజుల నిరసన కార్యక్రమానికి అనుమతిని ఏపీ పోలీసులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు, భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ శ్రేణులను అనుమతించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో, పోలీసుల ఆదేశాలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై భువనేశ్వరి కూడా మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలంతా తన బిడ్డలవంటి వారని, బాధలో ఉన్న తల్లిని కలిసేందుకు వస్తామంటే పోలీసులు అడ్డుకొని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల సంఘీభావ యాత్రలో తప్పేముందని, తనను కలవకూడదని చెప్పడానికి మీకేం హక్కు ఉందని పోలీసులను నిలదీశారు. చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తుంటే కార్యకర్తలతో పాటు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారని, నిజాయితీవైపు నిలబడ్డ వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తారని అన్నారు.