ఏ ముహూర్తాన బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ గురించి అనౌన్స్ చేశారో కానీ.. ఈ సినిమాకు ఎప్పుడూ అంత సానుకూల సంకేతాలు కనిపించడం లేదు.
అసలు టాలీవుడ్లోనే హీరోగా అనుకున్నంత స్థాయిలో నిలదొక్కుకోలేదు.. అప్పుడే బాలీవుడ్ ఎంట్రీ ఏంటి అన్నది ఈ సినిమాను ప్రకటించినపుడు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వినిపించిన ప్రశ్న.
పైగా దశాబ్దంన్నర కిందట రిలీజైన ‘ఛత్రపతి’ని రీమేక్ చేయాలనుకోవడం పట్లా వ్యతిరేకతే వ్యక్తమైంది. ఎందుకంటే అది పాత సినిమా, పైగా దాని గురించి హిందీ ప్రేక్షకులకు తెలియందేమీ కాదు. డబ్బింగ్ వెర్షన్‌ను జనాలు విరగబడి చూశారు.
ఇక అన్నింటికీ మించి తెలుగులో ‘ఔట్ డేటెడ్’ డైరెక్టర్ అన్న ముద్ర వేసుకుని ఇక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వి.వి.వినాయక్‌ను మనకంటే అడ్వాన్స్‌గా ఉంటుందన్న పేరున్న బాలీవుడ్లో సినిమా చేయడానికి దర్శకుడిగా ఎంచుకోవడం నెగెటివిటీని ఇంకా పెంచింది.
ఇవన్నీ ఒకెత్తయితే ‘ఛత్రపతి’ రీమేక్‌కు కథానాయిక ఎంపిక చేయడానికి పడుతున్న కష్టాలు మరో ఎత్తు. భారీగా పారితోషకం ఇస్తామన్నా సరే.. శ్రీనివాస్ సరసన నటించడానికి స్టార్ హీరోయిన్లు ముందుకు రావడం లేదు.
ఇప్పటిదాకా ఆ విషయం ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే.. కథానాయిక సంగతి తర్వాత అని షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు మొదలయ్యాయి కొన్ని నెలల ముందు. రూ.6 కోట్లతో ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్టింగ్ నిర్మాణం చేపట్టారట ముంబయిలో. ఆ పని జరుగుతుండగానే లాక్ డౌన్ వచ్చింది. సెట్ పని ఆగిపోయింది.
తర్వాత వర్షాల దెబ్బకు ఆ సెట్ మొత్తం దెబ్బ తిందట. మళ్లీ కొత్తగా సెట్ వేయాల్సిన పరిస్థితి తలెత్తిందట. ఇలాగే వర్షాలకు చాలా బాలీవుడ్ సినిమాల సెట్టింగ్స్ దెబ్బ తిన్నాయి. అందులో శ్రీనివాస్ సినిమా కూడా చేరింది. సినిమా మొదలు కాకముందే వరుసగా ఇలాంటి తలనొప్పులు రావడంతో మున్ముందు శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ పరిస్థితేంటో చూడాలి.