టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 5-4 గోల్ తేడాతో గెలిచి కాంస్య పతకం సాధించింది. ఈ పతకంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో చేరిన పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. చరిత్రాత్మక విజయంతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీలలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుుడు నందమూరి బాలకృష్ణ శుభాభినందనలు తెలిపారు. భారత్ కు 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో హాకీ క్రీడకు పతకం రావడం చాలా సంతోషకరమని బాలయ్య హర్షం వ్యక్తం చేశారు. పతకం సాధించిపెట్టి దేశ ప్రతిష్టను చాటి చెప్పిన హాకీజట్టుకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు చెబుతున్నానన్నారు..
హాకీ జట్టు కఠోర శ్రమతోనే పతకం లభించిందని, దేశ ప్రజల ఆశీస్సులు, మన్ననలు క్రీడా కారులకు ఎల్లవేళలా ఉంటాయని బాలయ్య అన్నారు. దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో క్రీడాకారులు పోరాడుతున్నారని, ఒలింపిక్స్ లో పోటీపడుతోన్న ఇతర క్రీడాకారులు కూడా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని బాలయ్య చెప్పారు.
కాగా, ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు వ్యక్తిగత విభాగంలో మూడు పతకాలు వచ్చిన సంగతి తెలిసిందే. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించగా…మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించింది. ఇక తెలుగుతేజం పీవీ సింధు….మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. తాజాగా, వ్యక్తిగత విభాగంలో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల కుస్తీ పోటీ సెమీ ఫైనల్లో విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టి భారత్ కు మరో పతకం ఖాయం చేశాడు. ఫైనల్లో గెలిస్తే గోల్డ్ లేదంటే సిల్వర్ మెడల్ ఖాయంగా వస్తుంది.