టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ చిత్రం తర్వాత నేషనల్ ‘క్రష్’ గా మారడంతో ‘రష్ ’మికకు సంబంధించిన పాత విషయాలు కూడా కొంతకాలంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక బ్రేకప్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు. రక్షిత్ శెట్టితో రష్మిక బ్రేకప్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కారణమని సోషల్ మీడియాలో ఇప్పటికీ పుకార్లు వస్తూనే ఉన్నాయి.
ఇక, విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్ చేస్తున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రక్షిత్ శెట్టితో రష్మిక విడిపోవడానికి కారణం విజయ్ దేవరకొండ కాదని సంచలన విషయం వెల్లడైంది. తన వల్లే రక్షిత్ శెట్టికే రష్మిక బ్రేకప్ చెప్పిందని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరున్న వేణు స్వామి చెప్పిన వైనం హాట్ టాపిక్ గా మారింది. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల విడాకుల తర్వాత వేణు స్వామి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
చైతూ, సామ్ లు విడిపోతారని నాలుగేళ్ల క్రితం చెప్పానని, చెప్పినట్లుగానే జరిగిందని వేణు ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన మాటలపై జనం ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో తాను రష్మిక, రక్షిత్ ల జాతకాలు చూశానని, ఆ తర్వాత రక్షిత్ శెట్టి నుంచి రష్మిక విడిపోవడమే మంచిది అని ఆమెకు సూచించానని వేణు స్వామి ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పడం సంచలనం రేపింది.
అంతేకాదు, రక్షిత్ శెట్టి నుంచి విడిపోతేనే రష్మిక సినీ కెరీర్ బాగుంటుందని చెప్పడంతోనే రష్మిక తన ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుందని వేణు స్వామి వెల్లడించారు. దాంతోపాటు, హైదరాబాద్ లోని రష్మిక ఇంట్లో తాను పూజలు కూడా నిర్వహించానని చెప్పారు. ఇక, రష్మిక పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె వివాహ జీవితం ఇబ్బందికరంగా ఉంటుందని వేణు స్వామి మరో బాంబు పేల్చారు.
అయితే, 2024 వరకు రష్మిక సినీ కెరీర్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. రష్మిక పుష్ప, పుష్ప-2, సీతారామం వంటి చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. కెరీర్ పరంగా కూడా సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోతోంది. ఏది ఏమైనా, రష్మిక బ్రేకప్ కు విజయ్ దేవరకొండ కారణం కాదని, తాను చెప్పడం వల్లే రష్మిక బ్రేకప్ చేసుకుందని స్వామి వెల్లడించిన సంచలన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు, తాజాగా తాను విజయ్ తో డేటింగ్ లో లేనని, తామిద్దరం ఫ్రెండ్స్ అని రష్మిక వెల్లడించడం తెలిసిందే.