ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేళ్లు పూర్తి కావస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి మరీ హోదా సాధిస్తానని చెప్పిన జగన్ అధికారం చేపట్టి నాలుగేళ్లు గడుస్తున్నా హోదా సాధించలేకపోయారు. కేవలం తన మీద ఉన్న కేసులకు భయపడి హోదా గురించి మోడీని జగన్ నిలదీయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఏపీకి హోదా రాకపోవడానికి గల కారణాలు ఇవి అంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు హోదా రాకపోవడానికి ఒక ఐఏఎస్ కారణం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఆ ఐఏఎస్ అధికారి కేంద్ర ఆర్థిక శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్నారని, ఆ సమయంలో ఆయన సరైన రీతిలో స్పందించకపోవడంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏపీ స్పెషల్ సీఎస్ గా ఆయన పనిచేస్తున్నారని రమేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. 2014 ఫిబ్రవరి 20వ తేదీన ప్రత్యేక హోదా కోసం ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని రమేష్ గుర్తు చేశారు. అదే విషయాన్ని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించిందని, దీంతో మార్చి 5వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అపాయింట్ డేట్ జూన్ రెండో తేదీ అని నిర్ణయించారని చెప్పారు.
అదే రోజున హోదాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని తాను కోరానని, అయితే కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే నోటిఫికేషన్ జారీ చేసేందుకు అభ్యంతరం లేదని కేంద్రంలోని పెద్దలు చెప్పారని గుర్తు చేసుకున్నారు. హోదా కోసం తాను ఐదు సమావేశాలు నిర్వహించానని, కానీ వాటిలో ఒక్క సమావేశానికి కూడా కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఆ ఐఏఎస్ అధికారి హాజరు కాలేదని అన్నారు. కనీసం ఆ అధికారికి బదులు వేరొకరిని ఆ సమావేశాలకు పంపించినా ఏపీకి హోదా వచ్చి ఉండేదని సంచలన ఆరోపణలు చేశారు.
చివరి ప్రయత్నంగా మే 15వ తేదీన తాను ఐదోసారి సమావేశం నిర్వహించానని, మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో అదే తన చివరి అస్త్రం అని గుర్తు చేసుకున్నారు. ఆఖరికి ఆ సమావేశానికి కూడా తాను చెప్పిన అధికారి గైర్హాజరు కావడంతో ఏపీకి హోదా అంశం అక్కడితోనే ఆగిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ పెద్దమనిషి ఆనాడు కేంద్ర ఆర్థిక శాఖలో హోదాకు ఆమోదం ఇచ్చే స్థాయిలో ఉన్నారని, ఆయన సకాలంలో స్పందించి ఉంటే ఏపీకి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పారు. ఇక, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఏపీకి సర్వీసును బదిలీ చేయించుకున్నారని, అంతకుముందు ఆయన తెలంగాణలో ఉండాలని కోరుకున్నారని గుర్తు చేశారు. ఏదేమైనా ఒక ఐఏఎస్ అధికారి వల్ల ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు అంటూ పివి రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.