సీఎం జగన్ పాలనలో రాష్ట్ర పరువు దేశంలోని అన్ని నదుల్లో మంట కలిసి పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్రపదేశ్ గా అవతరించాల్సిన రాష్ట్రాన్ని జగన్ గంజాయాంధ్రప్రదేశ్ గా మార్చివేశారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే భారత దేశంలో గంజాయి సరఫరా చేసే రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదికలో వెల్లడైంది.
2021లో పట్టుబడ్డ గంజాయి, హెరాయిన్ నిల్వలల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు అవమానకరరీతిలో అగ్రతాంబూలం దక్కింది. ఆ అవమానం మరువక ముందే తాజాగా స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కూడా దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల్లో ఏపీ నంబర్ వన్ గా నిలవడం షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన మరో నివేదికలో సైతం ఏపీ పరువు పోయింది. గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై అత్యధిక సిబిఐ కేసులు నమోదైన రాష్ట్రాలలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని తాజాగా పార్లమెంటులో వెల్లడైంది.
ఇలా, సీబీఐ కేసులలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రజలకు ఘోర అవమానం అని చెప్పవచ్చు. ఈ ప్రకారం పార్లమెంటుకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఇక, ఏపీలో ప్రజా ప్రతినిధులపై 10 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయని జితేందర్ సింగ్ వెల్లడించారు. మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. 2017-2022 మధ్య దేశంలోని ప్రజాప్రతినిధులపై ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు సిబిఐ నమోదు చేసిందో అన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.