ఏపీ రాజధాని అమరావతి అంటూ కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాకివ్వడంతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. 3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు వెలువరించడంతో జగన్ సర్కార్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని, ఏపీ రాజధాని ప్లానింగ్‌ను రాబోయే 6 నెలల్లో పూర్తి చేయాలని కీలక తీర్పునిచ్చింది.
ముందస్తు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఆ పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, అమరావతి రాజధాని అవసరాలకు తప్ప ఇతర వేరే పనులకు ఆ భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని ఆదేశించింది.
రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, లేని అధికారాలతో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయలేరని గుర్తు చేసింది. అంతేకాదు, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ తీర్పు వెలువడి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కారు అమలు చేయటం లేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని పిటిషన్లో రైతులు పేర్కొన్నారు. నిధులు లేవనే సాకుతో తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్ విచారణకు రావడంతో ఏపీ సర్కార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
పిటిషన్ లోని పలు అంశాలను పరిశీలించిన హైకోర్టు…కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.