వైసీపీ పాలనలో జగనన్న కాలనీల పేరిట చేపట్టిన కార్యక్రమం విఫలమైన సంగతి తెలిసిందే. పేదల కు ముందు ఇళ్లు కట్టించి ఇస్తానని చెప్పి…ఆ తర్వాత లబ్ధిదారులే కట్టుకోవాలని, ప్రభుత్వం తరఫు నుంచి కొంత నగదు, మెటీరియల్ ఇస్తామని చెప్పి ప్రజలను మభ్య పెట్టింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, మెటీరియల్ ఏ మూలకూ రాక…సెంటు స్థలం సరిపోక…చాలామంది సగంలోనే ఇళ్ల నిర్మాణాలు ఆపేశారు. ఈ క్రమంలోనే జగనన్న కాలనీలు చాలా చోట్ల నిరుపయోగంగా పడున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమం అమలు చేసేందుకు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కార్యక్రమం కింది గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించనుంది. ఈ ప్రకారం మార్గదర్శకాలను రివెన్యూ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా విడుదల చేశారు. ఇళ్లు, స్థలాల పంపిణీకి మార్గదర్శకాల జారీకి కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది.
ఆ పథకం నిబంధనలు, మార్గదర్శకాలు:
పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున మహిళ పేరుతో స్థలం
పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించకుంటే ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చే యోచన
ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి సదరు ఆస్తిపై పూర్తి హక్కులు ఆస్తి కేటాయించిన నాటి నుంచి పదేళ్ల తర్వాత లభిస్తాయి
అర్హత గలిగిన మహిళలకు జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ లేదా ఇల్లు పొందే అవకాశం
పట్టా ఇచ్చిన రెండేళ్ల లోగా ఇంటిని లబ్దిదారు నిర్మించుకోవాలి
ప్లాటును ఆధార్ కార్డు, రేషన్ కార్డులకు లింక్ చేయాలి