ఏపీలో ఉద్యోగులు పూర్తిగా మెత్తబడ్డారు. ఇంకేముంది.. సంక్రాంతి అయిన తెల్లారి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని, ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తామని.. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రకటనలు జారీ చేశాయి. అయితే.. సంక్రాంతి ముగిసి రెండు రోజులైనా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం మౌనం వీడకపోవడంతో ఆయా ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తర్జన భర్జన పడుతున్నారు.
దీనివెనుక ఏం జరిగిందనే చర్చ సాగుతోంది. వాస్తవానికి 11వ పీఆర్సీ వేయాలని.. సీపీఎస్ పింఛన్ విధానా న్ని రద్దు చేయాలని, అదేసమయంలో తమపై మోపుతున్న ముఖ హాజరు విధానాన్ని ఎత్తేయాలని కొన్నా ళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే..వీటిపై ఇప్పటి వరకు ప్రభుత్వంన నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. పైగా.. బకాయిలు కూడా ఇవ్వడం లేదు. కనీసం 1వ తారీకునాడు జీతమైనా ఇవ్వాలని కోరుతున్నారు.
అది కూడా ప్రభుత్వం చేయడం లేదు. దీంతో ఉద్యోగులు సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నట్టు గత ఏడాది డిసెంబరు 2, 3 తారీకుల్లోనే ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులు కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూశారు. అయితే.. సంక్రాంతి వచ్చింది వెళ్లింది.. కానీ, ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. ఇదిలావుంటే. ఈ నెల 7న ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగ సంఘాలను తన ప్యాలెస్‌కు ఆహ్వానించారు.
ఈసందర్భంగా వారికి ఆయనే స్వయంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు మెత్తబడ్డారనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి హామీలను జగన్ గతంలోనూ ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీ కూడా పరిష్కారం కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. మరి ఇప్పుడు కూడా అదే పంథాలో సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉన్నాయా? అనేది ప్రశ్న. మొత్తానికి ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నాయకులు రాజీపడుతున్నారనే వాదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం.