ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏమవుతుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ముఖ్యంగా వచ్చే 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని పదే పదే చెబుతున్న వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏంటి? అదేసమయంలో ఆయన పెట్టుకున్న వైనాట్ 175 లక్షం సాధించడమే సాధ్యమేనా? ఇవీ.. ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిశీలకులను సైతం ఆలోచింప జేస్తున్న ప్రధాన విషయం.
దీనికి కారణం.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నట్టుగా.. వైసీపీ అధినేత జగన్.. ఇటీవల ఒక తాజా సర్వే చేయించుకున్నారట. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. ఏం జరుగుతుంది? అనే విషయాన్ని ఆయన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించారని అంటున్నారు. దీనిలో కఠోరమైన నిజాలు.. కొన్ని వాస్తవాలు కూడా ఎదురయ్యాయని.. తాడేపల్లి వర్గాలు గుసగుసలాడుతున్నాయని చెబుతున్నారు.
వాస్తవానికి ఇలా వచ్చిన నివేదికను చాలా రోజులు సీఐడీ విభాగం మాజీ చీఫ్ సునీల్ సీఎం జగన్కు ఇవ్వకుండా దాచిపెట్టారని.. ఆయన ఎక్కడ బాధపడతారోనని ఆయన అనుకున్నారని కూడా అంటున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన సీఎం జగన్ ఆయనను వెంటనే తప్పించారని అంటున్నారు. సరే.. ఈ విషయం ఎలా ఉన్నా.. అత్యంత విశ్వసనీయంగా చేయించిన ఈ సర్వేలో.. వైసీపీకి ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే.. 30 – 40 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే.. పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుందని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచివివిధ రూపాల్లో లబ్ది పొందుతున్న వారు మాత్రం అనుకూలంగా ఓటు చేసే అవకాశం ఉందని.. లేని వారు మాత్రం వైసీపీని పక్కన పెట్టేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం సంక్షేమం అందుతున్న వారు రాష్ట్ర జనాభాలో 25 శాతం మంది ఉన్నారని.. మిగిలిన వారికి ఎలాంటి పథకాలూ అందడం లేదని.. దీంతో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. మొత్తంగా రాష్ట్రంలో వైసీపీని ఆదరించేవారి సంఖ్య తగ్గిపోతోందని స్పష్టం కావడంతో వైసీపీ నాయకులు అంతర్మథనం చెందుతున్నట్టు చెబుతున్నారు.