ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఏమాత్రం బాగోలేదంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల విషయంలో అధికారుల తీరు పట్ల పవన్ మండిపడ్డారు. లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. హోంమత్రి అనిత బాధ్యతాయుతంగా మెలగాలని చూపించారు. అలాగే పోలీసులపై కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు. పోలీసులు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు. అత్యాచార నిందితులను అరెస్ట్ చేసేందుకు కులం అడ్డు వస్తుందా..? క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది..? అని పవన్ ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు రియాక్ట్ అయ్యారు.
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. ఇదే మా విధానమని డీజీపీ అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయం.. చట్టానికి, రాజ్యాంగానికి లోబడే మేము పనిచేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని.. ఎవరికి ఎంత ప్రోటోకాల్ ఇవ్వాలో అంతే ఇస్తామని డీజీపే తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో పలు తప్పిదాలు జరిగాయన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగితే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. నేరస్తుల వేలిముద్రలు గుర్తించే సిస్టం లేకుండా చేశారని డీజీపీ ద్వారకా తిరుమల రావు గుర్తు చేశారు.
నేరాల నియంత్రణ, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామన్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైం, సోషల్ మీడియా వేధింపులు ఎక్కువయ్యాయని.. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించే హక్కు కోసం ట్రై చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.