ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పాముల పుష్ప శ్రీవాణి కులం వ్యవహారంపై రాజకీయంగా పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ ప్రచారం జరుగుతోంది. పుష్ప శ్రీవాణి సోదరి రామ తులసి ఎస్టీ కాదు కాబట్టే ఆమెకు ఉద్యోగం రాలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై పుష్ప శ్రీవాణి స్పందించారు.
రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. ఈ ప్రచారం ఎవరు, ఎందుకు చేయిస్తున్నారో భవిష్యత్తులో బయటపడుతుందని అన్నారు.తాను ఎస్టీని కాకుంటే, 2014లో తన కుటుంబం మొత్తానికి డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను ఎలా మంజూరు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
శ్రీకాకుళం మండలం పాలకొండ నియోజకవర్గంలోని టీడీ పారాపురానికి వెళ్లి తమ గురించి అడిగితే తాను ఎస్టీని అవునో కాదో వాస్తవాలు తెలుస్తాయని సవాల్ విసిరారు. తన సోదరి తులసి 2008లో డీఎస్సీలో కేఆర్‌పురం ఐటీడీఏలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారని, కానీ, జీవో నంబర్ 3 ప్రకారం ఆ ఉద్యోగానికి స్థానికులే అర్హులు అని తెలియడంతో అధికారులు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారని గుర్తు చేశారు. తనపై , తన సోదరిపై ఆరోపణలు చేస్తున్న వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని పుష్ప శ్రీవాణి సవాల్ విసిరారు.