రాజ్యసభకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఇష్యూపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త విని ముందుగా బాధ పడ్డానని రఘురామ అన్నారు. అయితే, ఎందుకు బాధపడ్డానో తాను చెప్ప లేనని చెప్పారు. గతంలో ఎన్నోసార్లు తాము దెబ్బలాడుకున్నామని గుర్తు చేసుకున్నారు.
టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పటి నుంచి విజయసాయితో పరిచయముందని, స్వభావరీత్యా నెమ్మదస్తుడని చెప్పారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా విజయసాయి ఎదురుపడితే తమ మధ్య చిరునవ్వు ఉండేదని, తమ మధ్య తీవ్రస్థాయి వైరం లేదని తెలిపారు. అయితే, రాజకీయాలన్నాక ఏదో మాట్లాడతామని, తనకు తెలిసినంతవరకు విజయసాయి చెడ్డవాడు కాదని, దుష్టుడి సహవాసంలో కొన్ని తప్పులు చేయవలసి వచ్చిందేమోననిఅన్నారు. తాను వైసీపీ నుంచి ఆర్నెల్లలోపే బయటపడగలరని, కొందరు అలా బయటపడలేరని చెప్పారు.
2014-19 మధ్య వైసీపీ కోసం విజయసాయి సొంతంగా ఖర్చు పెట్టారని, మద్రాస్ లో తన ఇంటిని, ఆఫీసును కూడా అమ్ముకున్నారని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో వైసీపీ తరఫున ఆయన కీలక పాత్ర పోషించారని, ఢిల్లీలో తనదైన ముద్ర వేశారని చెప్పారు. తన దృష్టిలో ఢిల్లీలో వైసీపీ లేనట్టేనని రఘురామ అభిప్రాయపడ్డారు. ఒకవేళ అయోధ్యరామిరెడ్డి కూడా రాజీనామా చేస్తే వైసీపీ పనైపోయినట్టేనని అన్నారు.