సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకా హత్య కేసు మిస్టరీ…మలయాళ థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఈ కేసులో మందు నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని దాదాపు మూడున్నరేళ్ల తర్వాత సీబీఐ విచారణ జరపడం సంచలనం రేపింది. అవినాష్ రెడ్డి పాత్రకు ఆధారాలున్నాయని సీబీఐ అధికారులు చెబుతోంటే….అసలు ఆ కేసుతో తనకు సంబంధం లేదని అవినాష్ రెడ్డి అంటున్న వైనం థ్రిల్లర్ మూవీ సీన్ కు తీసిపోదు.
ఈ క్రమంలోనే ఈ రోజు ఈ కేసులో అనూహ్య ట్విస్ట్ ఒకటి అందరికీ షాకిచ్చింది. ఈ హత్య కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని కోర్టులో సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్రువర్ గా మారిన దస్తగిరి సీబీఐ అడిగినట్లు స్టేట్ మెంట్ ఇస్తున్నాడని, దాని ఆధారంగానే ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, తనను సీబీఐ అధికారులు విచారణ జరిపారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో దస్తగిరిదే కీలక పాత్ర అని, అలాంటి నిందితుడికి బెయిల్ ఇవ్వడం సరికాదని భాస్కర్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని వ్యతిరేకించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ట్విస్ట నుంచి జనం తేరుకోక ముందే తాజాగా వివేకా హత్య కేసు మరో మలుపు తిరిగింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని, సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ ను మార్చాలని కోరుతూ ఈ కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు…విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించింది. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి సజావుగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దర్యాప్తు సక్రమంగానే నిర్వహిస్తున్నారని సుప్రీం ధర్మాసనానికి రాంసింగ్ తరఫు లాయర్ తెలిపారు. ఇరు పక్షాల వాదన విన్న న్యాయస్థానం ఈ పిటిషన్ తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.