“నా ప్రమేయం లేదు.. నేను తప్పు చేయలేదు.. అసలు నాకు తొక్కిసలాటకు సంబంధం లేదు“ అని పుష్ప అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనపై నమోదైన `హత్య` కేసుకు సంబంధించి చెప్పుకొచ్చారు(ఆయన తరపు న్యాయవాదులు). కానీ, పోలీసులు రాసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అల్లు అర్జున్ వస్తున్నట్టు సంధ్య ధియేటర్‌కు ముందే తెలుసునని పేర్కొన్నారు. అంతేకాదు.. టికెట్లు లేకుండా వచ్చిన అల్లు అర్జున్ టీం.. టికెట్లు కొనుక్కుని లైన్లలలో వేచి ఉన్న వారిని నెట్టుకుంటూ పోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక్కడితో కూడా ఆగలేదు.
అసలు తమకు ఏపాపం తెలియదని పేర్కొన్న సంధ్య సినిమా హాలుకు కూడా అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందుగానే సమాచా రం ఉందని.. అప్పటికే జనాలు కిక్కిరిసిపోయినా.. ఇంకా టికెట్లు విక్రయిస్తూనే ఉన్నారని పోలీసులు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ సంధ్య సినిమా హాల్లోకి పెద్ద ఎత్తున అనుచరులు, అభిమానులతో వచ్చారని పేర్కొన్నారు. “వారు రావడం రావడం.. సీట్లలో కూర్చున్న వారిని లాగి పడేశారు. డబ్బులు పెట్టిని కొనుక్కుని సీట్లలో కూర్చున్నవారిని అల్లు అర్జున్ తో పాటు వచ్చిన వారు లాగిపడేశారు. ఈ సందర్భంగానే తొక్కిసలాట జరిగింది“ అని పోలీసులు పేర్కొన్నారు.
సినిమా హాల్లో సుమారు 400 మంది పట్టే అవకాశం ఉందని..కానీ 3 వేల మంది వచ్చారని, ఇంత పెద్ద ఎత్తున అల్లు అభిమానులు రావడంతో సామాన్య ప్రేక్షకులు తట్టుకోలేకపోయారని తెలిపారు. రేవతి, ఆమె కుమారుడు కాళ్ల కిందనే ఉండిపోయారని, వాళ్లు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సంధ్య యాజమాన్యం అల్లు వస్తున్నారని తెలిసినప్పటికీ ఫ్యాన్స్‌కు టిక్కెట్లు అమ్మారని తెలిపారు. పెద్ద ఎత్తున జనం లోపలికి వచ్చినా అందర్నీ లాగి పడేసేచాన్స్ ఉన్నా పట్టించుకోలేదని, కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని, అసలు తాము అర్జున్ను రావద్దని చెప్పామని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ లాయర్ మౌనం!
అల్లు అర్జున్ దే అంతా తప్పని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కానీ, దీనిని సమర్థవంతంగా వాదించి కోర్టును ఒప్పించడంలో ప్రభుత్వ న్యాయవాది విఫలమయ్యారని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. “రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాలను కోర్టులో వాదించడంలో ప్రభుత్వం తరపు లాయర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు“ అని ఓ పోలీసు ఉన్నతాధికారి ఆఫ్ దిరికార్డుగా మీడియాకు చెప్పడం గమనార్హం. అంతేకాదు.. రేవతి మృతికి కారణం ఎవరు అన్నది కూడా గట్టిగా వాదించలేకపోయారని తెలిపారు. కాగా.. అసలు తప్పేలేదని చెబుతున్న అల్లు అర్జున్‌కు ఈ రిమాండ్ రిపోర్టు చూసిన తర్వాత.. నిప్పులేందే పొగరాదు! అనే మాట అక్షరాలా సరిపోయేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.