అల్లు అర్జున్ ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా ఆయన రికార్డ్ స్థాపించినట్లయింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
దిల్లీలో గురువారం నిర్వహించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో తెలుగు సినిమాలకు వివిధ కేటగిరీలలో అవార్డులు దక్కాయి.
కాగా అభిమానులు, కుటుంబసభ్యులు ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అల్లు అర్జున్ మొదటి నుంచి విలక్షణ నటుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకే విభిన్నంగా చేస్తూ కోట్లాది మంది అభిమానం చూరగొన్నారు.
20 ఏళ్ల కెరీర్లో 22 సినిమాలు చేయగా అందులో 19 మంచి విజయాలు సాధించడంతో సక్సెస్ఫుల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే బన్నీ పుష్పరాజ్ పాత్రతో తెలుగుతోపాటు హిందీలోనూ భారీ విజయాన్ని అందుకున్నారు.
ఆ చిత్రంలోని నటనకే బన్నీకి ఇప్పుడీ అవార్డు వచ్చింది.
69వ జాతీయ ఫిల్మ్ అవార్డులలో మొత్తం 31 అవార్దుల కోసం 28 భాషలలో 280 చిత్రాలు పోటీ పడ్డాయి. ఈసారి అవార్డులలో తెలుగు సినిమాల హవా కనిపించింది.
ఉత్తమ నటుడు, ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ సంగీతం, ఉత్తమ బ్యాంక్ గ్రౌండ్ సంగీతం, ఉత్తమ కొరియో గ్రఫీ, ఉత్తమ స్టంట్ కొరియో గ్రఫీ, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ అవార్డులు తెలుగు సినిమాలు, నటులకే వచ్చాయి.
ఉప్పెన సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఇక ఉత్తమ క్రిటిక్ అవార్డును తెలుగు సమీక్షకుడు పురుషోత్తమాచార్యులకు వచ్చింది. ఉత్తమ గీతరచయితగా చంద్రబోస్ ఎంపికయ్యారు. కొండపొలం సినిమా కోసం ఆయన రాసిన పాటకు ఈ అవార్డు వచ్చింది.
అలాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. ఉత్తమ నేపథ్య సంగీతం ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణికి, పాటల్లో ఉత్తమ సంగీతానికి పుష్ప సినిమాకు గాను దేవీశ్రీప్రసాద్‌కు అవార్డులొచ్చాయి.
జాతీయ అవార్డులు ఎవరెవరికి.. ఏఏ సినిమాలకు వచ్చాయంటే..
• ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
• ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి), కృతిసనన్ (మీమీ)
• ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (హిందీ)
• ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి -మరాఠీ)
• ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్ ఫైల్స్-హిందీ)
• ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి-హిందీ)
• ఉత్తమ యాక్షన్ డైరక్షన్: కింగ్ సాలమన్ (ఆర్ఆర్ఆర్)
• ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
• ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం)
• ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)
• ఉత్తమ సంభాషణలు, అడాప్టెడ్: సంజయ్‌లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి- హిందీ)
• ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ)
• ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్ (ఇరివిన్ నిజాల్ – మాయావా ఛాయావా)
• ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్ఆర్ఆర్- కొమురం భీముడో)
• ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛల్లో షో-గుజరాతీ)
• ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్ఆర్ఆర్ (రాజమౌళి)
• ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
• ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్ఆర్ఆర్)
• ఉత్తమ మేకప్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కాఠియావాడి)
• ఉత్తమ కాస్ట్యూమ్స్: వీర్ కపూర్ (సర్దార్ ఉద్దమ్)
• ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సర్దార్ ఉద్దమ్ (దిమిత్రి మలిచ్, మన్సి ధ్రువ్ మెహతా)
• ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
• ఉత్తమస్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస మోహన్ (ఆర్ఆర్ఆర్)
• ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనింగ్): అనీష్ బసు (చైవిట్టు-మలమాళం)
• ఉత్తమ ఆడియోగ్రఫీ (రీరికార్డింగ్): సినోయ్ జోసెఫ్ (ఝిల్లి డిస్కర్డ్స్- బెంగాలీ)
• అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్ఆర్ఆర్