ఆనందయ్య మందుపై ఈ రోజు (సోమవారం) చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినోళ్లకు అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు ఈ మందుపై హైకోర్టులో కేసు నడుస్తుంటే.. మరోవైపు ఇదే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ చేయటం గమనార్హం.
ఆనందయ్య మందు వినియోగించటంపై చోటు చేసుకునే దుష్పరిణామాలపై అధ్యయనం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ పేర్కొన్నారు.
ఆనందయ్య మందుపై వాదనల వేళ.. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో బ్లాక్ ఫంగస్ వస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 130 మంది చికిత్స పొందుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనపై ఆనందయ్య తరఫు న్యాయవాది బాలాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సరైన ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని.. ఆనందయ్య మందుకు అనుమతులు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. కేంద్రానికే ఉందని పిటిషన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం తమ న్యాయవాది వాదనలకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంది.
జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే.. కంట్లో వేసే మందు తప్పించి.. మిగిలిన మందులకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉందని.. అది రావటానికి మరో రెండు.. మూడు వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో ఆనందయ్య మందు వాటితే కరోనా తగ్గుతుందని చెప్పటానికి అవసరమైన నిర్దారణలు లేవని నివేదికలు తేల్చాయి.
ఆనందయ్య మందు వాడినంత మాత్రాన.. మిగిలిన మందులు వాడకుండా ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచన చేసింది. ఆనందయ్య మందు కోసం పంపిణీ కేంద్రానికి కొవిడ్ రోగులు వెళ్లొద్దని.. వారి బంధువులే వెళ్లాలన్న సూచన చేసింది. మందు పంపిణీ వద్ద కోవిడ్ రూల్స్ అమలవుతాయని పేర్కొన్నారు.
ఓవైపు ఆనందయ్య మందుపై ప్రభుత్వం తరఫు న్యాయవాది ఘాటు వ్యాఖ్యలు చేసిన వేళలోనే.. ప్రభుత్వం మందుకు పచ్చజెండా ఊపటం ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. హైకోర్టులో ఆనందయ్య మందు పై వాదనలు వినిపించే వేళలో సర్కారు తరఫు న్యాయవాది ప్రభుత్వాన్ని సంప్రదించలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొసమెరుపు : అధికారులపై కోర్టులో కేసు వేసిన ఆనందయ్య… ఈరోజు సాయంత్రం సడెన్ గా… ఎవరూ అడగకపోయినా మీడియా ముందుకు వచ్చి –నాకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించింది. ప్రభుత్వ సహకారం పూర్తిగా నాకు ఉంది. ప్రభుత్వ సహకారంతో ని మందు పంపిణీ చేస్తాను-అని మాట్లాడటం వెనుక మీనింగేంటో విజ్ఝులైన పాఠకులు మీరే అర్థం చేసుకోవాలి.