పోలీసులు అనుకోవాలే కానీ దేన్నైనా చేధించగలరు. ఆ సత్తా మన ఖాకీల సొంతం. 9 నెలులుగా మిస్ అయిన అమ్మాయి ఉదంతం ఒక కొలిక్కి రాని వేళ.. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి చెందిన మహిళ పవన్ వద్దకు వచ్చి తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో స్పందించిన పవన్.. పోలీసులకు స్వయంగా ఫోన్ చేసి.. ఈ ఉదంతానని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. అంతే.. కదిలిన పోలీసులు పది రోజుల్లోనే సదరు మిస్ అయిన అమ్మాయి ఆచూకీని పట్టేశారు.
జూన్ 22న మంగళగిరిలోని జనసేన ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించగా.. తన కుమార్తె మిస్ అయి తొమ్మిదినెలలు అవుతున్నా.. పోలీసులు తమ కుమార్తె జాడను కనిపెట్టలేదని పేర్కొన్నారు. తాము కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయినట్లుగా భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ వాపోయింది. పవన్ ఎంట్రీ ఇవ్వటంతో విజయవాడ సీపీ పీహెచ్ డీ రామక్రిష్ణ స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పది రోజుల్లోనే మిస్ అయిన అమ్మాయిని కనిపెట్టారు. ఆమె.. జమ్ములో ఉన్నట్లుగా తేల్చారు. యువతితో పాటు ఆమె స్నేహితుడ్ని విమానంలో విజయవాడకు తరలిస్తున్నారు.
ఇంతకూ అసలేం జరిగిందంటే..
భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్ రావు – శివకుమారి దంపతులకు ఇద్దరు సంతానం కాగా.. చిన్నమ్మాయి తేజస్విని. విజయవాడలోని పెద్దమ్మ ఇంట్లో ఉంటూ హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో సీనియర్ విద్యార్థి అయిన విజయవాడకు చెందిన అంజాద్ అలియాస్ షన్ను ప్రేమతో ఆమెను లోబర్చుకున్నాడు. గత ఏడాది వీరిద్దరు హైదరాబాద్ కు వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బుల్లేక.. ఫోన్లు.. నగలు అమ్మేశారు. తర్వాత కేరళ.. ముంబయి.. ఢిల్లీ తిరుగుతూ చివరకు జమ్ము చేరుకున్నారు.
అక్కడ హోటల్ లో అంజాద్ పనికి కుదిరాడు. ఇతరులతో మాట్లాడేందుకు తేజస్విని ఫోన్ ఇచ్చేవాడు కాదు. ఒక రోజున అంజాద్ లేని టైంలో అతని ఫోన్ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్ స్టాలో మెసేజ్ పెట్టింది. ఆ చిన్న ఆధారంతో వారు జమ్ములో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారున్న అడ్రస్ ను జమ్ము పోలీసులకు పంపారు. అక్కడి పోలీసులు టీంగా ఏర్పడి వారిని అదుపులోకి తీసుకొని.. ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు.
ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం విమానంలో విజయవాడకు తీసుకొస్తున్నారు. మిస్ అయిన తేజస్వి ఆచూకీని గుర్తించిన పోలీసులకు ఆమె తల్లి థ్యాంక్స్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా.. ‘తేజస్విని కిడ్నాప్ చేశారా?’ అని సీపీని పవన్ ప్రశ్నించగా.. కాదని.. వారు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు రాబడతామని చెప్పారు. మొత్తంగా తొమ్మిది నెలలుగా దొరకని మిస్ అయిన అమ్మాయి.. పవన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన పది రోజులే అమ్మాయి ఆచూకీని గుర్తించటం చూస్తే.. మన పోలీసుల సమర్థత ఇట్టే అర్థం కాక మానదు.