ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు విచారణ సాగుతూనే ఉంది. అధికారుల నుంచి నిందితుల వరకు కేసుకు సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ5 నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ తాజాగా పులివెందుల కోర్టులో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ వేసింది. వివేకా కేసులో మరో ఆరుగురుని సీబీఐ విచారించాలని తులసమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివ ప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకుడు బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ విచారించే విధంగా ఆదేశించాలని కోరింది. తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత పులివెందుల కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది.
ఈ సందర్భంగా తులసమ్మ వివేకా కుటుంబపై పలు ఆరోపణలు చేశారు. “ఆయనకు తన అల్లుడితోనే వివాదాలు, విభేదాలు ఉన్నాయి. కానీ, దాస్తున్నారు. కేసును పక్కదారి పట్టించారు. దీనిపై విచారణ చేయండి“ అని కోర్టును కోరారు.
ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ ఆక్షేపించారు. మరో ఆరుగురిని సీబీఐ విచారించాలని సీబీఐని తులసమ్మ కోరారు. వివేకా హత్యలో ఆర్థిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయని ఆ అంశాలను పరిగణనలోకి తీసులేదని తులసమ్మ ఆరోపించారు.
వివేకా కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. “నా భర్తకు సంబంధం లేదు. ఆయన అమాయకుడు. హత్యలు చేసే నేరసంస్కృతి మాకు లేదు. అయినా.. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు“ అని కోర్టుకు వివరించారు.