నాకు నచ్చని ఒకే పదం.. అంటూ తెలుగు సినిమాలో ఒక డైలాగు ఉన్నట్టుగానే ఏపీ సీఎం జగన్కు కూడా నచ్చని పదం ఏంటంటే.. `అమరావతి`!! ఆయన ముందు.. ఆయన వెనుక కూడా.. ఎవరూ ఈ మాట అనేందుకు సాహసం చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే కేంద్రం కూడా.. ఒక రకంగా పార్లమెంటులో తప్ప ఎక్కడా అమరావతిని ప్రస్తావించడమే లేదు. అలాంటి పరిస్థితిలో .. ఇప్పుడు సీఎం జగన్కు బిగ్ షాక్ ఇస్తూ.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ రాజధాని అమరావతే అని గుర్తించింది. ఆదివారం వరకు ఢిల్లీ వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ అని ఎయిర్ ఇండియా పేర్కొనేది. కానీ. సోమవారం నుంచి `అమరావతి టూ ఢిల్లీ` అని వెబ్ సైట్లో పేరు మార్చింది. టిక్కెట్ స్టేటస్, ప్రకటనలో కూడా అమరావతి టూ ఢిల్లీ, ఢిల్లీ టూ అమరావతి అని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్లు మార్చింది. దీంతో అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా ఏపీ రాజధాని ఏదీ? అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వంపై సెటైర్లు వేసే పరిస్థితి. విమానాలకు సంబంధించి టిక్కెట్ల విషయంలో కూడా గన్నవరం-ఢిల్లీ, గన్నవరం -చెన్నై, గన్నవరం – హైదరాబాద్ అని మాత్రమే ముద్రించేవాళ్లు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా పేర్లు మార్చడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు 12వందల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీకి మూడు రాజధానులంటూ మాటమార్చి.. రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రకటన అమరావతి వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆనందపడే విషయమనే చెప్పాలి. అదే సమయంలో సీఎం జగన్కు భారీ షాక్ ఇచ్చిందనీ చెప్పకతప్పదు. మరి ఇప్పుడు ఈ విమానాలను కూడా నిషేధిస్తారా.. కేసులు పెడతారా? అనేది చూడాలని అంటున్నారు విమాన ప్రయాణికులు.