రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అభ్యర్థి ఎవరు అయినా కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నా యి. ఇదీ ఆంధ్రావని వాకిట నడుస్తున్న రాజకీయం. ఇదే క్రమంలో కొత్త ముఖాలు వస్తాయా అన్న ఆశ కూడా చాలా మందిలో ఉంది.
ఆశ కన్నా ప్రశ్నే ఎక్కువగా ఉంది. కానీ పాత ముఖాలకు మళ్లీ ఛాన్స్ ఇస్తామని నాయకత్వాలు అంటున్నాయి. కొన్ని చోట్ల వలస నాయకులకు విపరీతం అయిన ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వైసీపీ కి సంబంధించే వస్తున్నాయి. రాజోలులో రాపాక వరప్రసాదరావు జనసేన టికెట్ పొంది గెలిచి, ఇప్పుడు జగన్ గూటి పక్షిగా మారిపోయారు.
ఆయన్ను రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉంచి, ప్లీనరీని కూడా నిర్వహింపజేయాలన్నది ప్లాన్..అదే చేశారు కూడా ! ఇక్కడే సీన్ రివర్స్ కొట్టింది. దీంతో అక్కడ రెండుసార్లు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు తన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి అసంతృప్తి వెల్లడించారు. వెళ్లగక్కారు కూడా ! ఇదే సమయంలో పలువురు కీలక నాయకులు కూడా ఆయన వెంటే ఉన్నారు.
ఇక కుప్పంలో కూడా అభ్యర్థి ఎవరన్నది తేల్చేసి సస్పెన్స్ కు తెరదించారు పెద్దిరెడ్డి అనే మంత్రి. భరత్ పోటీచేస్తాడని, ఇక్కడ వేరెవ్వరూ బరిలో ఉండరని స్పష్టం చేస్తూ పుకార్లకు చెక్ పెట్టారు. ఇక్కడ చంద్రబాబుపై పోటీచేసే అభ్యర్థి సినీనటుడు విశాల్ అని చెప్పి ప్రకటనలు కొందరు ఊదరగొట్టారు.
అదేవిధంగా పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు అని, ఆయన బదులు ఆయన కొడుకు కిట్టూ పోటీచేస్తారని మొన్నటి నియోజకవర్గ ప్లీనరీలో కొడాలి నాని ప్రకటించేశారు. అదేవిధంగా గన్నవరం లో వల్లభనేని వంశీనే మళ్లీ పోటీ చేస్తారని కూడా కొడాలి నాని చెప్పేశారు.
మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటలో అయితే మళ్లీ నేనే పోటీచేస్తా తగ్గేదేలే అంటూ ధర్మాన కృష్ణదాసు (మాజీ డిప్యూటీ సీఎం) ప్రకటించేశారు. దాదాపు ఇదే వాతావరణం ఉమ్మడి విజయనగరం జిల్లా, కురుపాంలో కూడా ఉంది. అక్కడ కూడా అభ్యర్థి తానేనని పాముల పుష్ప శ్రీవాణి పరోక్ష సంకేతాలు ఇచ్చి తగాదాలకు చెక్ పెట్టారు.
ఇక్కడ ఈమె పై మరదలు పల్లవి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినా ఎవరికివారే తమ అభ్యర్థిత్వాలను వీలున్నంత వరకూ కన్ఫం చేసుకుంటున్నారు. తెలుగుదేశంలోనూ ఇదే వాతావరణం ఉన్నా ఆ పార్టీ నాయకులు మాత్రం మీడియా ఎదుట బాహాటంగా ప్రకటనలు చేసేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రం తామే అభ్యర్థులం అని ప్రజల దగ్గర చెప్పుకుంటున్నారు.