జనసేన 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హిందీ భాషను వద్దంటే ఎలా..? భారత దేశమంతటికీ బహు భాషలు ఉండాలి..? ప్రజల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు ఉండాలంటే బహుభాషా విధానమే మంచిది.. అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల ప్రత్యర్థులు ఇప్పటికే విమర్శించారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సైతం పవన్ కు చురకలు వేశారు. జనసేనకు `ఆంధ్ర మతసేనా` అంటూ కొత్త పేరు పెట్టారు.
“జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారు. ఇప్పుడు ఆయన మోడీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. జనసేనా పార్టీని `ఆంధ్ర మతసేనా` పార్టీగా మార్చారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం.
సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం . పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ గారు ఇప్పటికైనా మేల్కోండి. బీజేపీ మైకం నుంచి బయట పడండి.“ అంటూ షర్మిల ఘాటుగా ట్వీట్ చేశారు.