జగన్ , వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత అన్న జగన్ వల్లే తమ కుటుంబంలో కలతలు రేగాయని గతంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక, జగనన్న పాలన బాగోలేదంటూ రాజకీయపరంగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల విమర్శలతో విరుచుకుపడ్డారు. విశాఖలో పరిపాలన మొదలుపెట్టబోతున్నామంటూ అన్న చేసిన కామెంట్లను చెల్లి తప్పుపట్టారు.
విశాఖలో పాలన మొదలుబెట్టేందుకు ఇన్నాళ్లు ఏ అడ్డంకులు ఎదురయ్యాయని? ఎందుకు మొదలుబెట్టలేదని ప్రశ్నించారు. విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటూ మూడేళ్లుగా జగనన్న ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. అలా చేయడమే మీ చేతకాని కమిట్మెంట్ అంటూ విమర్శించారు. ఇక, రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళిపోతున్నా, ఐటీ హిల్స్ నుంచి కంపెనీలు పెట్టే బేడ సర్దుకుంటున్నా చూస్తూ ఉండటమే మీ రోడ్ మ్యాప్ అంటూ ఘాటుగా విమర్శించారు.
మరోవైపు, ఆంధ్రులకు తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని, ఇదే మీ విజన్ అంటూ జగన్ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కకపోయినా మౌనం వహించడమే మీకు ప్రాక్టికల్ అంటూ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక విశాఖలో భూకబ్జాలు, గుట్టలు కొట్టడం, కొండలను అమ్మేయడం, భూములను మింగడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందని, విశాఖపట్నం వైసీపీ విజన్ ఇదే అని షర్మిల దుయ్యబట్టారు.
హఠాత్తుగా ఎన్నికలకు ముందు పదేళ్ల వ్యూహాలు అంటూ జగన్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర తీసిందని షర్మిల చురకలంటించారు. విశాఖ నుంచే పాలన అంటూ రుషికొండపై భవనాల సముదాయాన్ని ప్రారంభించిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిల కౌంటర్ ఇచ్చారు. మరి షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.