ఏపీలో గత ప్రభుత్వంతో అదానీ కంపెనీ చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ కు అదానీ 1750 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. జగన్-అదానీ విద్యుత్ డీల్ పై గవర్నర్ కు షర్మిల వినతి పత్రం అందించారు.
ఆ ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని గవర్నర్ ను షర్మిల కోరారు. అదానీకి లాభం-రాష్ట్ర ప్రజలకు పెనుభారంగా ఆ డీల్ మారిందని షర్మిల అన్నారు. ఆ ముడుపుల వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోయిందని షర్మిల అన్నారు. అదానీ దేశం పరువు తీస్తే, జగన్ రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. ఆ స్కాంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని జాతీయ కాంగ్రెస్ కోరిందని, రాష్ట్రంలో కూడా దీనిపై దర్యాప్తు చేయాలని, అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీతో జగన్ పాతికేళ్ల విద్యుత్ ఒప్పందం వల్ల రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని దుయ్యబట్టారు.