ఏపీలో మళ్లీ ఈవీఎంల లొల్లి మొదలైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏకంగా 144 స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. వైయస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 12 సీట్లతో సరిపెట్టుకుంది. ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చినప్పటి నుంచి వైకాపా నేతలు ఈవీఎంల విషయంలో అనుమానాలు వెలిబుచ్చడం స్టార్ట్ చేశారు. వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఈవీఎంలపై సందేహాలు ప్రచురించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చేరారు.
ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్లే ముద్దు అన్నట్లుగా సంచలన ట్వీట్ చేశారు. `న్యాయం జరగడం మాత్రమే కాదు, న్యాయం జరిగినట్లు కనిపించాలి, అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా ప్రబలంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగించబడతాయి. ఈవీఎంలు కాదు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి` అంటూ జగన్ తన అధికారిక ఎక్స్ ద్వారా ఈవీఎంలపై విమర్శకలు కురిపించారు.
దీంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. గతం గుర్తు లేదా లేక మర్చిపోయి మాట్లాడుతున్నావా అంటూ జగన్ ను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నేతలు కూడా ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో జగన్ టీడీపీని మరియు చంద్రబాబును దుయ్యబట్టారు. ఈవీఎంల పనితీరు భేష్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చారు.
`ఈవీఎంలలో 80శాతం జనాభా ఓట్లు వేశారు, అది రికార్డ్ పోలింగ్. బటన్ నొక్కాక ఏ పార్టీకి ఓటు వేశారనేది వీవీప్యాట్ లో కనపడుతుంది. ఒకవేళ వేరే పార్టీ గుర్తు కనపడితే ప్రజలు గమ్మునుంటారా..? కంప్లయింట్ చేస్తారు కదా..? కానీ అటువంటి కంప్లయింట్ ఒక్కటి కూడా రాలేదు` అంటూ అప్పట్లో జగన్ ఈవీఎంలకు మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడేమో మాట మార్చి ఈవీఎంలదే తప్పంటున్నారు. ఈ నేపథ్యంలోనే `151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి, 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు` అంటూ జగన్ ట్వీట్ కు టీడీపీ కౌంటర్ ట్వీట్ చేసింది.