ఆంధ్రప్రదేశ్‌లో పది రోజుల కిందట ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు రావడానికి ఇంకో పది రోజులు సమయం ఉంది. వచ్చేది తమ ప్రభుత్వమే అని ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, అటు వైసీపీ ధీమాగా ఉన్నాయి. కానీ సర్వేలు, రాజకీయ విశ్లేషకుల మొగ్గు ఎక్కువగా కూటమి వైపే కనిపిస్తోంది.
కానీ వైసీపీ మాత్రం అదేం లేదు, గెలిచేది తామే అని ధీమా వ్యక్తం చేస్తోంది. ఐతే ఫలితాల ముంగిట ఎవరికి వాళ్లు ధీమా వ్యక్తం చేయడం మామూలే. కానీ వైసీసీ ఈ విషయంలో మరీ అతి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో జగన్ ప్రమాణ స్వీకారానికి డేట్, టైం, వేదిక ఫిక్స్ చేసేయడం.. అంతే కాక ఆ సిటీలో హోటల్ రూమ్స్ కూడా బుక్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎన్నికల్లో విజయం సాధిస్తే అప్పటికప్పుడు ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే ఇంత అతి అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలు జరగడానికి ముందు ఇలాంటి కాన్ఫిడెన్స్ చూపిస్తే.. జనాల్లో కూడా తామే గెలవబోతున్నామన్న భావన కలిగించవచ్చు. వాళ్లను ప్రభావితం చేయొచ్చు. కానీ ఎన్నికలు అయిపోయాక మరీ ఇంత అతి చేయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేప్పొద్దున ఫలితాలు తేడా కొడితే.. ఇప్పుడు చేసిందంతా ట్రోల్ మెటీరియల్‌గా మారి.. వైరి వర్గాలకు ఆయుధంగా మారుతుంది. అప్పుడు ఉన్న బాధ చాలదని, విపరీతంగా ట్రోలింగ్‌కు గురి కావాల్సి వస్తుంది. ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు నిర్ణయం అయిపోయాయి. ఇక ఎవరు ఏం మాట్లాడినా విలువ ఉండదు. బహుశా అధికారుల మీద ఫలితాలు వచ్చే వరకు పట్టు కోల్పోకూడదన్న ఉద్దేశంతో వైసీపీ వాళ్లు ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండవచ్చు కానీ.. తేడా వస్తే మాత్రం ట్రోలింగ్ ఒక రేంజిలో ఉంటుందనేది గుర్తు పెట్టుకుంటే మంచిది.