ఇటీవల కాలంలో చంద్రబాబు, లోకేష్ సభల్లో జై జూనియర్ ఎన్టీఆర్ అనే నినాదాలు వినబడుతున్నాయి. ఇటీవల చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో జరిగిన ఘటనలను ఎన్టీఆర్ ఖండించారు. అయితే.. చంద్రబాబు ప్రస్తావన లేకుండానే తన విమర్శ పూర్తిచేయడంతో ఈ వీడియో మరో కాంట్రవర్శీకి దారి తీసింది.
అయితే ఈ రెండిటి మధ్యా వైసీపీ స్ట్రాటజీ ఉందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. లేని పోని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ వైసీపీ మైండ్ గేమ్‌కు పాల్పడుతోందని చెబుతున్నాయి.
అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబసభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇంకా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భువనేశ్వరిని ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను నందమూరి కుటుంబం ముక్తకంఠంతో ఖండించింది.
అయితే నందమూరి కుటుంబమంతా బాలకృష్ణ నివాసం నుంచి అసెంబ్లీలో జరిగిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను జూనియర్ ఎన్టీఆర్ కూడా తప్పుబట్టారు. కాకపోతే ఆయన స్పందనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదు. కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.
తమ అభిమాన హీరోను విమర్శిస్తే ఊరుకునేదని టీడీపీ నేతలను గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను వదిలేసి కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసనకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడిప్పుడే కుప్పంలో వైసీపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలపై టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
టీడీపీపై వైసీపీ కొత్త మైండ్‌గేమ్‌కు తెరలేపిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవలి కాలంలో టీడీపీ కార్యక్రమాలు జరిగే చోట జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సభల్లోనే కాకుండా టీడీపీ కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ అభిమానుల వెనుక వైసీపీ ఉందని, ఇదంతా వైసీపీ నేతలే పథకం ప్రకారం చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పొల్చకుంటే ప్రస్తుతం టీడీపీ పుంజుకుంటోందని, వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు కారణాలు కూడా చెబుతున్నారు.
మున్పిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు బ్యాంక్ పెరిగిందని అంటున్నారు. ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో తరుచుగా ఎన్టీఆర్ ప్రస్తావన వస్తోందని దీని వెనుక వైసీపీ ఉందని టీడీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు.
చాలాకాలంగా ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీ అంటే తెలియనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీతోనే కాకుండా నందమూరి-నార కుటుంబాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
చంద్రబాబు ఇలాకాలో ఆయన వారసుడు లోకేష్ కు అనుకూలంగా ఉండాల్సింది పోయి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదేపదే తేవడం టీడీపీకి మింగుడుపడడం లేదు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రతినబూనారు. అనుకున్నట్లే కుప్పం మున్సిపాలిటీలో పాగా వేశారు.
ఈ ధీమాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడిచండం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడే చావుతప్పి కన్నులొట్టబోయినట్లుగా టీడీపీ పరిస్థితి ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న హంగామా టీడీపీకి తలనొప్పిగా మారింది. అయితే, ఇదంతా వైసీపీ ఎత్తుగడ అన్నది టీడీపీ ఆరోపణ.