2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అనంతరం వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫ్యాన్ పార్టీలోని కీలక నాయకులంతా జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో విజయసాయిరెడ్డి కూడా చేరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కుటుంబంలోని మూడు తరాలతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి.. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటే నడిచారు. పార్టీలో నెంబర్ 2గా తిరుగులేని అధికారాన్ని అనుభవించారు. అటువంటి వ్యక్తి సడెన్ గా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటన చేయడం సెన్సేషన్ అయింది.
ఇప్పటికే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఉపరాష్ట్రపతికి రాజీనామా పత్రం అందించగా.. ఆయన ఆమోదం తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ సీటు దక్కేది ఎవరికి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు ఎంపీ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు సైకిల్ ఎక్కేయగా.. ఆర్. కృష్ణయ్య బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలను బీసీ నేతలకే కేటాయించారు.
టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ బాబు.. బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య ఏకాగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాతో.. ఆయన ఎంపీ సీటును ఆయన సామాజిక వర్గానికి చెందిన వారితోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన కూటమి నేతలు రాజ్యసభ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇదే తరుణంలో ఖాళీ అయిన ఎంపీ సీటు బీజేపీకి వదిలేయాలని ఢిల్లీ పెద్దల నుంచి కబురు వచ్చింది. అందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సుముకత వ్యక్తం చేశారని ఇన్సైడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక ఒకవేళ అదే నిజమై బీజేపీకి రాజ్యసభ స్థానం దక్కితే.. ఆ పార్టీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పదవిని సొంతం చేసుకునే అవాకశాలు ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. ఈసారి ఏమైనా లెక్కలు మారితే మార్పులు జరగొచ్చేమో కానీ.. కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ స్థానం లాంచనమే అని బలంగా టాక్ నడుస్తోంది.